డాక్టర్ వెంకట రమణ గారు తన బ్లాగ్ లో చిత్తూరు నాగయ్య గారి పోతన సినిమా గురించి ప్రస్తావించారు. అంతర్జాలం లో మహకవి పోతన పద్యాలు చదువుతూ ఉంటె ఒక పద్యం నన్ను విశేషంగా ఆకట్టుకుంది. క్షీరసాగరమధనంలో, అమృతం గురించి సాగరాన్ని చిలుకుతుంటే గరళం వచ్చింది. లక్ష్మిదేవి, కామధేనువు, ఐరావతం, కల్ప వృక్షం లాంటి శుభప్రదమైన వాటిని అన్నింటిని అందరు పంచుకున్నారు. కానీ హాలాహలం వచ్చి అందరిని దహించ పోబోగా, దేవతలు ఆందరూ పాహిమాం అంటూ భోళా శంకరుడిని వేడుకున్నారట. ఆ సందర్భం లోని పద్యం ఇది. ఆస్వాదించండి మీరు కూడా.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో
పోతనగారి పద్యాలలో సరళంగా ఉండి నాబోటి ఎప్పుడూ తెలుగు చదవని వాడికి కూడా అర్దం అవ్వటం కాకుండా ఎంతో మధురంగా ఉంది ఈ పద్యం. విషాన్ని సేవించ బోతున్నది తన భర్త అని తెలుసు, వచ్చినది అందరిని దహించ గల హాలాహలం అని తెలుసు, కానీ సకల జనుల మేలు కోరినది అయిన సర్వ మంగళా దేవి, తన మంగళ సూత్రం మహత్యం నమ్మింది కనుక తన భర్తను, ఆ గరళాన్ని నిబ్బరంగా స్వీకరించమంది. పార్వతిదేవి కి ఉమ, అపర్ణాదేవి, భవాని, హైమావతి, భువనేశ్వరి లాంటి అనేక పేర్లు ఉండగా సర్వ జనుల మేలు కోరింది కనుక సర్వ మంగళ అని సంభోదించాడు ఇక్కడ పోతన అన్నపూర్ణదేవిని. భర్త చే గరళాన్ని హరించినది కనుక ఆ తల్లి అయింది జగన్మాత. లోకేశ్వరుడు అయిన శివుడు కంటే, విరూపాక్షి దేవి మంగళసూత్రంబు గట్టిదని భావించిన కవి హృదయం ఎంత మధురం.
నా మిత్రుడు మరియు కళాశాల రోజులలో సహాధ్యాయీ శ్రీధర్ తెలుగు లోనే రాయటం మరియు ఉత్తర ప్రత్యుత్తరములు జరపటం గురించి తెలుసుకుని, ఉత్తేజం పొంది నేను తెలుగు లో రాసిన మెదటి బ్లాగ్ ఇది. ఎన్నో ఏళ్ళ క్రితం నుంచి తెలుగులో సంభాషించిటం తప్ప రాయటం మర్చిపోయున నాకు శ్రీధర్ చూపిన దారి నచ్చింది కనుక ఇది మిత్రుడు శ్రీధర్ కి అంకితం.
No comments:
Post a Comment